భయం భయం : 24 గంటల్లో 351 కేసులు

రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 351మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. తాజా కేసుల్లో రాష్ట్రంలోని వారు 275మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 50మంది, విదేశాల నుంచి వచ్చిన 26మంది ఉన్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 7,071కి చేరింది. ఇందులో స్థానికంగా 5,555మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 1,253మంది, విదేశాల నుంచి వచ్చిన 263మంది కరోనా బారినపడ్డారు. బుధవారం కర్నూలులో ఒకరు, గుంటూరులో మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 90కి చేరింది. కర్నూలు జిల్లాలో కొత్తగా 59కేసులు నమోదయ్యాయి.

ఆదోనిలో 27, కర్నూలు అర్బన్‌లో 17మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. నెల్లూరు జిల్లాలో 49మంది, చిత్తూరు జిల్లాలో కొత్తగా 35మందికి వ్యాధి సోకింది. వీటిలో తిరుపతి నగరంలో 13, తిరుపతి రూరల్‌లో 3, నిండ్రలో 5, చంద్రగిరిలో 4, పీలేరులో 3, వెదురుకుప్పంలో 2చొప్పున ఉన్నాయి. కృష్ణాజిల్లాలో మరో 30మందికి వ్యాధి సోకింది. మచిలీపట్నం డివిజన్‌లో 13, నూజివీడు డివిజన్‌ల్లో 9 కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో మరో 57కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో మరో ఐదుగురికి వైరస్‌ నిర్ధారణ అయింది. పార్వతీపురంలో ముగ్గురు పోలీసులకు పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

కడప జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి. చింతకొమ్మదిన్నెలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లకు కరోనా సోకింది. గుంటూరు జిల్లాలో 17, తూర్పుగోదావరి జిల్లాలో 27మందికి కొవిడ్‌-19 నిర్ధారణ అయింది. శ్రీకాకుళం జిల్లా మందసకు చెందిన ఓ వ్యక్తి(45) కరోనాకు చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. 15రోజుల కిందట తన వివాహ వేడుక జరుపుకునేందుకు శ్రీకాకుళం వెళ్లి వచ్చిన ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. ఈ మరణాన్ని ధ్రువీకరించాల్సి ఉంది.

Leave a Reply

*