అచ్చెన్నాయుడు ను ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలివే

ఈఎస్‌ఐలో సిఫారసు లేఖల ఆధారంగా కొనుగోళ్లు జరగవని, కాంట్రాక్టులు కూడా ఇవ్వరని టీడీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు ప్రజాప్రయోజనార్ధం గానీ, ప్రభుత్వ ప్రయోజనం కోసం గానీ సిఫారసు లేఖలు ఇవ్వడం సర్వసాధారణమన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను ఏసీబీ అధికారులు రెండోరోజు శుక్రవారం కూడా విచారించారు. అచ్చెన్నాయుడి న్యాయవాది మాగులూరి హరిబాబు, డాక్టర్‌ అమృతవల్లి సమక్షంలో విచారణ ఐదు గంటలపాటు సాగింది. ఏసీబీ డీఎస్పీలు టీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, చిరంజీవి తమ సిబ్బందితో కలసి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు అచ్చెన్నను ప్రశ్నించారు. శస్త్రచికిత్స చేయించుకున్న మాజీ మంత్రి నొప్పితో బాధపడుతూ.. ఎక్కువ సేపు కూర్చోలేక.. బెడ్‌పై పడుకొనే సమాధానాలిచ్చారు.

రెండోరోజు మొత్తం సిఫారసు లేఖల మీదనే అధికారులు ప్రశ్నించారు. ఆంధ్ర సచివాలయం హైదరాబాద్‌లో ఉన్న సమయంలో మూడు సిఫారసు లేఖలు, అమరావతికి వచ్చిన తర్వాత మరో రెండు సిఫారసు లేఖలు అచ్చెన్న ఇచ్చారని వారు పేర్కొన్నారు. మొదట ఇచ్చిన మూడు సిఫారసు లేఖలతో తమపై అచ్చెన్న ఒత్తిడి తెచ్చినట్లు ఈఎ్‌సఐ డైరెక్టర్‌ డాక్టర్‌ రమేశ్‌కుమార్‌ అభియోగం మోపారని, దీనికి ఏమి సమాధానం చెబుతారని అడిగారు. ‘అన్ని ప్రభుత్వ విభాగాల్లో లేఖలనేవి సర్వసాధారణ విషయం. ఆయా లేఖలను సంబంధిత అధికారులు సలహాగా మాత్రమే తీసుకుంటారు.

ఈఎస్‌ఐలో సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకునే అవకాశంలేదు. రాష్ట్ర మంత్రిని వారు పరిగణనలోకి తీసుకోరు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ఈ సంస్థలో కొనుగోళ్ల అధికారం పూర్తిగా డైరెక్టర్లదే. టెలిహెల్త్‌కు సంబంధించి కొనుగోళ్లు జరిగిన సమయంలో నేను కార్మిక శాఖ మంత్రిగా లేను’ అని ఆయన విస్పష్టంగా చెప్పారు. ఏ విధంగా చూసినా ప్రభుత్వం రాజకీయ కక్షతో తనపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తోందన్నారు. శనివారం కూడా విచారణ కొనసాగిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. కాగా.. రెండురోజులుగా సరిగ్గా నిద్ర లేకపోవడంతో అలసటగా ఉందని.. గంట విశ్రాంతి కావాలని అచ్చెన్న అంతకుముందు కోరగా.. అధికారులు అర్ధగంట మాత్రమే ఇచ్చారు. ఇంకోవైపు.. శుక్రవారం ఉదయం జీజీహెచ్‌ వైద్యులు ఆయనకు ఎండోస్కోపీ చేశారు. రెండో దఫా శస్త్రచికిత్స చేశాక.. సమస్యలేవైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఈ పరీక్ష నిర్వహించారు. రిపోర్టులు రావలసి ఉందని వైద్యులు తెలిపారు.

Leave a Reply

*