బీజేపీ జమిలీ అన్నది..! వైసీపీ సమర్థించాల్సి వచ్చింది..! కమలానికి ఫ్యాన్ సపోర్ట్..!!

భారతీయ జనతా పార్టీ అంటే..తనకు ఎంత భక్తో…వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించింది. జమిలీ ఎన్నికలకు.. ఒకే దేశం-ఒకే ఎన్నికలు అనే ముద్దు పేరు పెట్టి మరీ సపోర్ట్ చేసింది. జమిలీ ఎన్నికలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమర్ధిస్తోందని పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి దృష్ట్యానే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందట. జమిలీ ఎన్నికలు జరిగి.ే.. ఏపీ ప్రయోజనాలు, అభివృద్ధి ఎలా సాధ్యమో చెప్పలేరు. ఎందుకంటే..అదో నినాదమే కదా. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు, అవినీతి బాగా తగ్గుతుందని చెప్పుకొచ్చారు. అవినీతి గురించి విజయసాయిరెడ్డి మాట్లాడితే..అందరూ చెవులు రిక్కించి వింటారు కదా..ఎంతైనా..!

జమిలి ఎన్నికలతో జాతీయ పార్టీలకే అధిక లాభం చేకూరుతుందని విజయసాయిరెడ్డి ఒప్పుకున్నారు. ప్రాంతీయ పార్టీలను మింగేయడానికే బీజేపీ ఈ ప్రతిపాదన తెచ్చిందని అంగీకరించారు. అయినా సరే జమిలీకి మద్దతు తెలిపారు. బీజేపీ అంటే ఎంత భయంతో కూడిన గౌరవమో అర్థం చేసుకోవచ్చు. దీనికి ప్రతిగా ప్రాంతీయ పార్టీల మనుగడ దెబ్బతినకుండా వాటికి స్పష్టమైన భరోసా ఇవ్వాలట. బీజేపీతో వైసీపీ కుమ్మక్కయితే.. వైసీపీని లా కమిషన్ కాపాడాలట. చార్టెడ్ అకౌంటెంట్ తెలివి తేటలు ఇలాగే ఉంటాయికదా..!

ఆంధ్రప్రదేశ్ అధికార పక్షం తెలుగుదేశం పార్టీ.. ముందస్తుగా జమిలీ అయితే ఒప్పుకునే ప్రశ్నే స్పష్టం చేసింది. సాధారణంగా.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు కలిసే వస్తున్నాయి. కాబట్టి ఎన్నికలను ఇలా ఎదుర్కొనే విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదన్న టీడీపీ ముందస్తు జమిలీకి మాత్రం నో చెప్పింది. ఇప్పుడు వైసీపీ.. ముందస్తు అయినా.. సమయానికే అయినా జమిలీకి సిద్ధమని లేఖ ఇచ్చింది. ఇటీవలి కాలంలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా.. వైసీపీకి సమర్థించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.

Leave a Reply

*