సీఎం జగన్‌కు చుక్కెదురు.. సీబీఐ కోర్టు షాకింగ్ డెసిషన్

సీబీఐ కేసుల్లో వ్యక్తిగత మినహాయింపు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసుకున్న అభ్యర్థనను తోసిపుచ్చి సీబీఐ కోర్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. విచారణలో ఉన్న ఐదు చార్జిషీట్లను కలిపి ఒకేసారి విచారించాలని జగన్ తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. సీబీఐ విచారణ పూర్తయ్యేంత వరకూ ఈడీ విచారణ చేపట్ట రాదన్న జగన్ పిటిషన్‌ను కూడా సీబీఐ కోర్టు కొట్టివేసింది.

వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసును శుక్రవారం విచారణ జరిపిన సీబీఐ కోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ఈ వారానికి జగన్‌కు వ్యక్తిగత హాజరు మినహాయంపు ఇచ్చింది. దీని కోసం వైఎస్ జగన్ ఆబ్సెంట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మానప్రసాదరావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచారణకు హాజరయ్యారు.

వైఎస్ జగన్‌పై ఉన్న అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవ్వాల్సి ఉంది. అయితే ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక అధికారిక, పరిపాలన పరమైన కార్యక్రమాలతో బిజీగా ఉన్నానని.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించిన విషయం తెలిసిందే.

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయన్న సీబీఐ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు జగన్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. కోర్టుకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌లో ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని.. అలాగే డిశ్చార్జ్ పిటిషన్లు అన్నింటిని కలిపి విచారించాలని విజ్ఞ‌ప్తి చేశారు.

Leave a Reply

*