ఏపీ డీజీపీకి చంద్రబాబు ఘాటైన లేఖ

టీడీపీ నాయకులపై తప్పుడు కేసులకు నిరసనగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌‌కు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటైన లేఖ రాశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుస అరాచకాలపై బాబు ధ్వజమెత్తారు. దళితులపై దాడులు- దౌర్జన్యాలు, టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు, అరెస్ట్‌లపై మండిపడ్డారు. అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడం…. ఇప్పుడు అయ్యన్నపాత్రుడిపై వరుసగా అనేక కేసులు పెట్టడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు, నాయకులపై కక్ష సాధించడమే వైసీపీ ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని విమర్శించారు. 20ఏళ్లు ప్రజాసేవలో ఉన్న దళిత వైద్యుడు సుధాకర్‌రావుపై కక్ష సాధించిందని, తర్వాత మరో దళిత మహిళా డాక్టర్ అనితారాణిపై కక్ష సాధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకంగా బీసీలపై వైసీపీ ప్రతీకారం తీర్చుకుంటోందని మండిపడ్డారు.

బీసీ నాయకులను, వెనుకబడిన వర్గాల ప్రజలను తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్‌లతో వేధిస్తోందని లేఖలో పేర్కొన్నారు. అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసులు పెట్టి, చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసిందన్నారు. అచ్చెన్నాయుడి అరెస్ట్ నుంచి తేరుకోకముందే అయ్యన్నపాత్రుడిపై వరుస కేసులు పెట్టడం బీసీ వర్గాలను షాక్‌కు గురిచేస్తోందన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం అయ్యన్నపాత్రుడిదని… నిజాయితీ పరుడు, ఎవరినీ నొప్పించని నాయకుడన్నారు. ఏవిధమైన విచారణ లేకుండా అయ్యన్నపాత్రుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వైసీపీ ప్రభుత్వ దురుద్దేశానికి ప్రత్యక్ష సాక్ష్యమని దుయ్యబట్టారు. రాజకీయ సంకుచిత ప్రయోజనాల కోసం పోలీసులే వైసీపీ కోరలుగా మారడం బాధాకరమన్నారు.

అయ్యన్నపై నిర్భయ కేసు పెట్టడమే వైసీపీ దురుద్దేశాలకు అద్దం పడుతోందని తెలిపారు. వైసీపీ తొలుత తన సొంత మీడియా ద్వారా, తన సోషల్ మీడియా ద్వారా తాము ఎంచుకున్న వ్యక్తిని, నాయకుడి ప్రతిష్ట దెబ్బతీస్తారని…ఆయనను అప్రదిష్ట పాలు చేశాక, తమ అనుచరులతో ఆయనపై తప్పుడు ఫిర్యాదులు చేయిస్తారని ఆరోపించారు. ఆ తప్పుడు ఫిర్యాదుపై పోలీసులు ఐపిసి, సిఆర్ పిసి సెక్షన్ల కింద వేర్వేరు కేసులు పెడతారని చంద్రబాబు లేఖలో రాశారు. తర్వాత నోటీసులు ఇవ్వకుండా వాళ్లను అరెస్ట్ చేసి వేధింపులకు గురిచేస్తారని మండిపడ్డారు. 2019లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి వైసీపీ చేస్తున్న తంతు ఇదే అన్నారు. లచ్చాపాత్రుడి ఫొటో తొలగించినందుకుగాను అయ్యన్నపాత్రుడు 15న నర్సీపట్నం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారని తెలిపారు.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయ్యన్నపాత్రుడిని వేధించడం, ప్రతీకారం తీర్చుకోడానికే వరుసగా ఆరు కేసులు పెట్టారన్నారు. తనపై పెట్టిన తప్పుడు కేసులపై అయ్యన్న కోర్టుల ద్వారా పోరాడి ఉపశమనం పొందారని వెల్లడించారు. ఇప్పుడు పెట్టిన కేసు కూడా అయ్యన్నపై కక్ష సాధింపులో భాగమే అని పేర్కొన్నారు. వైసీపీ కక్ష సాధింపు ధోరణి రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేయడమే కాకుండా ప్రజాస్వామ్యానికే పెనువిఘాతంగా వ్యాఖ్యానించారు. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో ప్రజాస్వామ్య నాలుగు మూల స్థంభాలు లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్, జ్యుడిసియరీ, మీడియాను వైసీపీ నాశనం చేస్తోందని విమర్శించారు.

ఈ దుందుడుకు చర్యలు ఇలాగే కొనసాగితే వైసీపీ చేతిలో కకావికలమైన వ్యవస్థలనే భావితరాలకు వారసత్వంగా సంక్రమించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పార్టీ చేస్తున్న దురాగతాలకు పోలీసు శాఖ, ప్రజాస్వామ్య వ్యవస్థలు బలికాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ శాఖ అధిపతిగా డీజీపీ ఉందని సూచించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై, అన్యాయాలను ప్రశ్నించిన వారిపై వైసీపీ చేస్తున్న విచక్షణారహిత దాడులు, దౌర్జన్యాలపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రబోధాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ‘‘శాంతిభద్రతలే సమష్టి పౌర వ్యవస్థకు(రాజ్యానికి) ఔషధం. ఎప్పుడైతే రాజ్యం వ్యాధిగ్రస్తం అవుతుందో తక్షణమే ఔషధాన్ని అందించాలి’’ అని అంబేద్కర్ పేర్కొన్నారు. డాక్టర్ అంబేద్కర్ ఆనాడు చెప్పిన ఈ సూక్తి, ప్రస్తుతం ఏపీలో పరిణామాలకు అద్దం పడుతోందన్నారు. రాజకీయ కక్ష సాధింపుల కారణంగా రాష్ట్రంలో పౌరవ్యవస్థ వ్యాధిగ్రస్తమైందని…కాబట్టి అంబేద్కర్ చెప్పిన ఔషధం డోస్ అందించాల్సిన బాధ్యత శాంతిభద్రతల శాఖదే అని సూచించారు. ‘‘ఈ రోజు వ్యాధిగ్రస్తమైన రాజ్యానికి మీరిచ్చే చికిత్సే రేపటి చరిత్రలో న్యాయనిర్ణేత’’ అన్న అంబేద్కర్ సూక్తిని తమ దృష్టికి తీసుకువస్తాన్నాను అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

*