ఏపీలో నిజంగా స్వాతంత్ర్యం ఉందా?: దీపక్‌రెడ్డి

జగన్ సర్కార్‌పై టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్రంలోని ప్రజలకు నిజంగా స్వాతంత్ర్యం ఉందా? బ్రిటీషు వారు తమ స్వార్థం కోసం భారతీయులను కులం, మతం, ప్రాంతాల వారీగా విభజించి పాలించారు. జగన్ ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రవర్తిస్తోంది. లిక్కర్, శాండ్, ల్యాండ్, మైన్స్ వ్యాపారాల్లో ప్రభుత్వం మునిగి తేలుతోంది. పోలీసులు వైసీపీ వారికి పర్సనల్ సెక్యూరిటీ గార్డుల్లా వ్యవహరిస్తున్నారు. మీడియాపై, ప్రశ్నించేవారిపై దాడి చేస్తున్నారు. దళిత మహిళపై 10 మంది మూడు రోజులు అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్లో వదిలి వెళితే.. ఆమెకు ఏం న్యాయం చేశారు. నామినేషన్ల సమయంలో మహిళలని కూడా చూడకుండా వారిని తడిమి చెక్ చేశారు. బ్రిటీషు కాలం నాటికన్నా అన్యాయమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయనడానికి ఇవే నిదర్శనాలు. 15 నెలల్లో ప్రభుత్వం ఎందుకని ఒక్కసారైనా అఖిలపక్ష సమావేశం నిర్వహించలేదు. మండలిలో ఛైర్మన్‌పై, ప్రతిపక్ష సభ్యులపై దాడి చేశారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తానన్నాడు. ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అన్న వ్యక్తికి భవన నిర్మాణ కార్మికుల ఆకలి కేకలు వినిపించలేదా? ‘మాటతప్పను-మడమ తిప్పను’ అన్న నాయకుడి చెవికి అమరావతి రైతుల ఆక్రందనలు ఎక్కడం లేదా? జేసీ ప్రభాకర్ రెడ్డి‌పై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం నీతిమాలిన తనం కాదా? 54 కేసులు పెట్టి వేధించి, చివరకు కరోనాకు గురిచేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు నెగిటివ్ వస్తే.. ఇప్పుడు పాజిటివ్ వచ్చింది. అందుకు కారణం ప్రభుత్వం కాదా? పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తికి కరోనా రావడానికి కారకులు ఎవరు? అనంతపురం డీఎస్పీ సహా ఇతర పోలీస్ అధికారులపై హత్యాయత్నం కేసు పెట్టాలి. 100కు వంద ఓట్లు తమకే పడినట్లు ప్రభుత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తోంది. వారికి 50 ఓట్లు వస్తే, టీడీపీకి 40 ఓట్లు పడ్డాయని తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించి, ప్రజల పక్షాన నిలవాలనే చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు. భయపెడితే భయపడే పార్టీ కాదు తెలుగుదేశం. ఎందుకంటే టీడీపీ దౌర్జన్యాలు, దోపిడీలు, అవినీతి నుంచి పుట్టిన పార్టీ కాదు’ అని దీపక్‌రెడ్డి వివరించారు.

Leave a Reply

*