అచ్చెన్న చుట్టూ అసలు ఏం జరుగుతుంది ?

మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత, తన చిన్నాన్న అచ్చెన్నాయుడిని ఎలాగైనా జైలులో ఉంచేందుకు జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుడిగా బాబాయి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉందన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్‌)లో ఉన్న అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు మాజీ మంత్రి దేవినేని ఉమతో కలిసి ఆయన మంగళవారమిక్కడకు వచ్చారు. ఆస్పత్రి అధికారులు అనుమతించకపోవడంతో వైద్యులను అడిగి అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన పరిస్థితిపై ప్రతి రోజూ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయాలని వైద్యులను ఎంపీ కోరారు. అలాగే ఆరోగ్యం కుదుటపడిన తర్వాత అచ్చెన్నాయుడిని నేరుగా కోర్టుకు అప్పగించాలని కోరుతూ దేవినేని ఉమతో కలిసి ఆస్పత్రి అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం రామ్మోహన్‌ మీడియాతో మాట్లాడారు. అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి అదేశించారని… కానీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సంతకం లేకుండా ఓ అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ పేరుతో నివేదిక పంపిస్తున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రి అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పారు. అచ్చెన్నాయుడిని ఎలాగైనా జైలులో పెట్టాలని సీఎం జగన్‌ ఏసీబీని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే అచ్చెన్నకు కోవిడ్‌ పరీక్షలు చేయించాలని డిమాండ్‌ చేశారు. ఎర్రన్నాయుడి కుటుంబంపై కక్షగట్టి జగన్‌ ఇదంతా చేస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. అవినీతి జరిగినట్లు ఆధారాలు లేకపోయినా కేసులు పెట్టి అచ్చెన్నపై బురద జల్లాలని యత్నిస్తున్నారన్నారు.

స్థానిక సీఐ అత్యుత్సాహం: న్యాయవాది

అచ్చెన్నాయుడి ఆపరేషన్‌ విషయంలో స్థానిక సీఐ రాజశేఖరరెడ్డి తీరుపై ఆయన న్యాయవాది మాగులూరి హరిబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఐ ఓ రాజకీయ నాయకుడిగా వ్యవహరించారని ఆరోపించారు. సీఐకి, కేసుకు ఎటువంటి సంబంధం లేకపోయినా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు.

Leave a Reply

*