రామచంద్రయ్య కూడా నీతులు చెబుతున్నాడే..! పవన్‌ని ముంచడానికేనా..?

సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య రాజీనామా చేశారు. టీడీపీతో పొత్తుపై రాష్ట్ర నేతలతో అధిష్టానం చర్చించలేదనేది ఆయన అభ్యంతరం. ఉన్నపళంగా చంద్రబాబు పవిత్రుడని ఆయన చెప్పలేరట. అలాగే కిరణ్ కుమార్ రెడ్డితో పని చేయలేరట. ఇంతకీ ఈయన ఎవరు కాంగ్రెస్ వాదా..?. టీడీపీ వాదా..? కుల పార్టీకి వీర సైనికుడా..? కడప జిల్లాకు చెందిన రామచంద్రయ్యకు ఇంత వరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన చరిత్ర లేదు. టీడీపీలో చంద్రబాబు నాయుడు.. ప్రొత్సహించారు. ప్రజాబలం లేకపోయినా… రాజ్యసభ ఇచ్చి ప్రొత్సహించారు. దాంతో ఆయనకు మాజీ ఎంపీ హోదా వచ్చింది.

అయితే చిరంజీవి పీఆర్పీ పెట్టగానే.. అందులో చేరిపోయారు. చిరంజీవికి సలహాదారుడిగా వ్యవహరించారు. ఆయన తీసుకున్న నిర్ణయాల్లో రామచంద్రయ్య పాత్రే కీలకమని చెబుతున్నారు. కడప జిల్లాకు చెందినా.. కులం ఓట్లు ఎక్కువగా ఉన్నాయని మచిలీపట్నంలో పీఆర్పీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని విలీనం చేయాలని… చిరంజీవిపై ఒత్తిడి తెచ్చిన వారిలో… రామచంద్రయ్య ముఖ్యులని అప్పటి పీఆర్పీ నేతలు చెబుతూంటారు. ఆ సలహాలతో సక్సెస్ అయిన ఆయన.. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి పీఆర్పీ వర్గీయులకు దక్కిన ఎకైక ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. అది కూడా అయిపోయింది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ అయ్యారు.

ఎమ్మెల్సీ పదవి కాలం చివరిలో.. టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించినా.. కనీసం చంద్రబాబు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన.. ఏ పార్టీలో చేరాలో తెలియక.. టీడీపీపై విమర్శలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇప్పుడు ఎన్నికల మూడ్ వచ్చేసింది కాబట్టి.. తేల్చేశారు. బహుశా.. ఆయనకు వైసీపీలో చాన్స్ ఉండదు కాబట్టి.. జనసేనకే వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు అన్నయ్యను తన సలహాలతో ముంచేశారు. ఇప్పుడు తమ్ముడ్ని మళ్లీ బయటకు రాకుండా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంతైనా రాజకీయాల గురించి.. విలువల గురించి.. రామచంద్రయ్యే చెప్పుకోవాలి. రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయంటే.. ఏంటో అనుకుంటాం కానీ.. రామచంద్రయ్య లాంటి వాళ్లు మాట్లాడటమే.. ఈ పతనానికి సాక్ష్యం.

Leave a Reply

*