గుంటూరు వైసీపీ చిందర వందర..! చేస్తోంది జగనేనా..?

జగన్ ను ఎవరూ ఓడించాల్సిన పని లేదు.. జగన్ ను జగనే ఓడించుకుంటారు. ఈ మాట గుంటూరు వైసీపీ నేతలే చెబుతున్నారు. ఉన్న పళంగా పార్టీ నేతలందర్నీ… ఇంటికి పంపించేస్తున్నారు. ఎవరు కొత్తగా తెరపైకి వస్తారో.. తమ సీటుకు ఎసరు పెడతారోనని అటు సిట్టింగ్‌లు, ఇటు నియోజక వర్గాల ఇన్‌చార్జ్‌లు సైతం వణికిపోతున్నారు. గుంటూరు నగరంలో తొలి నుంచి వీర విధేయునిగా వ్యవహరిస్తూ 24 గంటలూ పార్టీ కోసమే పరితపించే నగర పార్టీ అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డికి టిక్కెట్‌ ఇవ్వటం లేదని ఆ పార్టీ అధినేత తేల్చి చెప్పేశారు. రాత్రికి రాత్రి పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జిగా మాజీ డీఐజీ చంద్రగిరి ఏసురత్నాన్ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఒక్క గుంటూరే పశ్చిమమే కాదు.. చిలుకలూరిపేటలో ఆల్రెడీ పార్టీని చీలికలు పేలికలు చేసి పడేశారు. తాడికొండలోనూ అదే పరిస్థితి . తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న కత్తెర క్రిస్టియానాకు కూడా సీటు లేదని పార్టీ అధినేత జగన్‌ రెండు రోజుల క్రితం చెప్పినట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఆమె తాడికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆమెనే ఇన్‌చార్జిగా కొనసాగించి ఆమె సేవలు వినియోగించుకున్న పార్టీ అధినేత ఇప్పుడు ఆమె బలమైన అభ్యర్థి కాదు అన్న నెపంతో బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుందని సూచించినట్లు తెలిసింది. రెండు, మూడు రోజుల్లో ఈ నియోజకవర్గానికి కూడా కొత్త నేత పేరు తెరపైకి రానుంది.

చిలకలూరిపేట నియోజకవర్గంలో రాజుకున్న రగడ ఇంకా ఆరలేదు. అలాగే గుంటూరు ఎంపీ సీటు విషయంలో కూడా జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని కూడా పార్టీ శ్రేణులు జీర్ణించుకో లేకపోతున్నాయి. గుంటూరు ఎంపీ సీటు నీదేనని నమ్మించి విజ్ఞాన్‌ విద్యా సంస్థల అధినేత డాక్టర్‌ లావు రత్తయ్య కుమారుడు శ్రీకృష్ణదేవరాయులను చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టేలా చేశారు. గుంటూరులో నాలుగేళ్లుగా పని చేసుకుంటే.. చివరికి నువ్వు నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయమని కృష్ణదేవరాయలును ఆదేశించారు. మరో ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు నియోజకవర్గ ఇన్‌చార్జిలు పరిస్థితి కూడా తేడాగా ఉంది. జగన్ సంగతి తెలుసు కాబట్టి.. వారు కూడా… సిద్ధమవుతున్నారు. పార్టీ కార్యక్రమాల కోసం డబ్బులు ఖర్చు పెట్టడం తగ్గించుకున్నారు.

Leave a Reply

*