కూకట్ పల్లి బరిలోకి హరికృష్ణ కుమార్తె ! నిజమెంత ?

తెలంగాణాలో ఎన్నికలు దగ్గరపడుతున్నా తెలుగుదేశం పార్టీ మహాకూటమిలో భాగంగా పోటి చేసే స్థానాల విషయంలో మాత్రం స్పష్టత రావడం లేదు. ఒకవైపు తెరాస అభ్యర్ధులు బీఫారాలు అందుకున్నామని ఆనందంగా ఉంటె తెలుగుదేశం కాంగ్రెస్ సహా కూటమిలోని పార్టీల అభ్యర్ధులు ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం తొలి జాబితాలను విడుదల చేసాయి.. కాని కొన్ని కీలక స్థానాల విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతా రావడం లేదు. కాని ఆశావాహులు మాత్రం ముందు నుంచే ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

సీటు ఖరారు కాకముందే తెలుగుదేశం పార్టీ నుంచి సత్తుపల్లి అభ్యర్ధి సండ్రా వెంకటవీరయ్య, శేరిలింగం పల్లి స్థానం ఆశించిన భవ్య సంస్థల అధినేత వెనిగళ్ళ ఆనందప్రసాద్ ప్రచారంలో దూసుకుపోయారు. ఇక ఉప్పల్ సీటు ఆశించిన మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ ప్రచారం చేసారు. ఇక విడుదల చేసిన జాబితాలో ఈ ముగ్గురు పేర్లు ఉండటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే తెలుగుదేశం తరుపున పోటి చేయడానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి కూకట్ పల్లి స్థానంలో గత పది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా…

ఆయనకు మాత్రం ఇంకా సీటు ఖరారు కావడం లేదు. ఈ సీటు నుంచి ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు. చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళిన సమయంలో ఈ సీటు పెద్దిరెడ్డికి ఖరారు చేసారని ప్రముఖ పత్రికల్లో వార్తలు వచ్చినా అంతక ముందు జరిగిన ప్రచారం ప్రకారం నందమూరి కళ్యాణ్ రామ్ ఇక్కడి నుంచి పోటి చేస్తారని ప్రచారం జరిగింది. అలాగే ఈ సీటు కోసం మందాడి శ్రీనివాసరావు కూడా ఆశాపడుతున్నారని తెలిసింది. కళ్యాణ్ రామ్ ముందుకి రాకపోయినా ఈ ఇద్దరు నేతలు ఇక్కడి ర్యాలీలు కూడా చేసారు. ఇక ఇప్పుడు తాజాగా మరో పేరు వినపడుతుంది.

ఈ సీటు కోసం దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని బరిలో ఉంటారని ప్రచారం ఊపందుకుంది. ఒక ప్రముఖ పత్రికకు తెలుగుదేశం నేత ఇచ్చిన ఇంటర్వ్యులో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీచేస్తే బాగుంటుందని భావించామని చెప్పిన ఆయన… హరికృష్ణ కుమారుడు కళ్యాణ్‌రాం లేదా కూతురు సుహాసిని పోటీపై పార్టీలో చర్చించామన్నారు. కళ్యాణ్‌రాం ఆసక్తి కనబరచకపోవడంతోనే సుహాసిని అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించామన్నారు. ప్రస్తుతం ఇది తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ ఆమె ఇక్కడి నుంచి పోటి చేస్తే మాత్రం ఎన్టీఆర్ తర్వాత నందమూరి కుటుంబం నుంచి తెలంగాణాలో బరిలోకి దిగిన రెండో వ్యక్తిగా నిలుస్తారు.

Leave a Reply

*