నూతన్ నాయుడు 12 కోట్లకు టోకరా

శిరోముండనం కేసులో అరెస్టయిన సినీ నిర్మాత నూతన్‌ నాయుడుపై విశాఖలోని మహారాణిపేట పోలీస్‌స్టేషన్‌లో మరోకేసు నమోదైంది. విశాఖ జిల్లా రావికమతానికి చెందిన నాగరాజు, తెలంగాణలోని చేవెళ్లకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు అతడిపై మోసం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనకున్న పరిచయాలతో బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.5 లక్షలు తీసుకున్నాడని నాగరాజు, అదే బ్యాంకులో సౌత్‌ ఇండియా రీజినల్‌ మేనేజర్‌ పోస్టు ఇప్పిస్తానని రూ.12కోట్లు తీసుకున్నట్టు శ్రీకాంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో 2019లో నూతన్‌నాయుడును కలిసి డబ్బు తిరిగి ఇవ్వాలని కోరామని తెలిపారు. అందుకు నిరాకరించిన నూతన్‌నాయుడు నాగరాజును కులం పేరుతో దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మేరకు సీఐ సోమశేఖర్‌ చీటింగ్‌, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కేసును దర్యాప్తు నిమిత్తం ఈస్ట్‌ ఏసీపీ కులశేఖర్‌కి బదిలీ చేశారు. బాధితులు కొంత డబ్బును ఖాతాకు బదిలీ చేశామని చెప్పడంతో వాటి వివరాల కోసం ఆయా బ్యాంకులకు లేఖలు రాశామని, ఆ వివరాలు వచ్చిన తర్వాత కొంత స్పష్టత వస్తుందని ఏసీపీ తెలిపారు.

పోలీస్‌ కస్టడీకి నూతన్‌ నాయుడు

శిరోముండనం కేసులో అరెస్టయ్యి విశాఖ సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న నూతన్‌ నాయుడిని పెందుర్తి పోలీసులు కస్టడీకి తీసుకొన్నారు. ఏసీపీ ప్రవీణ్‌కుమార్‌, సీఐ అశోక్‌కుమార్‌ నూతన్‌ని స్టేషన్‌లోనే విచారించారు. అనంతరం సుజాతనగర్‌లోని అతడి ఇంటిలో సోదా చేశారు. నూతన్‌నాయుడు తండ్రి సన్యాసిరావు నివాసంలోనూ తనిఖీ చేశారు.

Leave a Reply

*