బిజెపిలోకి వైసీపీ ఎంపీలు…11నే ముహుర్తం ?

గోకరాజు గంగరాజు కరడుగట్టిన కాషాయవాది. కాని ఆయన ఫ్యామిలీ మాత్రం వైసీపీలో చేరింది. స్వయానా కొడుకు, సోదరులు అందులో చేరిపోయారు. దేశమంతా బిజెపి ఇతర పార్టీల నేతలను ఆకర్షిస్తుంటే.. ఇక్కడ మాత్రం బిజెపివారినే వైసీపీలోకి లాగేశారనే టాక్ మోగుతోంది. అసలు గంగరాజుగారేమిటి.. వారి ఫ్యామిలీ ఏమిటి.. వాళ్లు వైసీపీలో చేరడం ఏంటి అంటూ అందరూ షాకయ్యారు. ఈ షాకింగ్ న్యూస్ వెనక మరో షాకింగ్ న్యూస్ ఉంది. నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు బిజెపిలో చేరనున్నారనేదే ఆ న్యూస్.

అవును. ఆయన బిజెపిలో చేరడానికి రెడీ అయిపోయారు. నా ఎంపీనే మీరు లాగేస్తారా అన్న కోపంతో.. విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపి.. అక్కడ బిజెపి ఫ్యామిలీనే తన ఎంపీకి ప్రత్యామ్నాయంగా రంగంలోకి దింపేశారు. ఇందుకు జగన్ ప్రయోగించిన అస్త్రం.. కరకట్ట మీదున్న వందల ఎకరాల భూమి. గోకరాజు గంగరాజు ఫ్యామిలీకి అక్కడ గెస్ట్ హౌస్ ఉందనే విషయం అందరూ మాట్లాడతారు.. కాని దాని చుట్టూ ఉన్న భూమి గురించి ఎవరూ ప్రస్తావించరు. అంత విలువైన భూమి ఆయనకు ఉంది అక్కడ.

 

మీరు మాకు మద్దతివ్వండి. మీ ఆస్తి మీకు పదిలంగా ఉండేలా చేస్తాం. ఇది వైసీపీ వారికిచ్చిన ఆఫర్ అని టాక్. ఎటూ రాజధాని అమరావతి కొనసాగుతుంది. మీ భూముల విలువ కూడా పెరుగుతుంది.. కాబట్టి మీకు మంచి లాభమే.. ఇది ఆ ఆఫర్ లోని క్లారిటీ. దీంతో స్వతహాగా బిజినెస్ పర్సన్ అయిన గోకరాజు గంగరాజుగారు ఆలోచనలో పడిపోయారు. వ్యూహాత్మకంగా తాను తప్ప మిగతావారిని చేర్చేసి.. తాను మాత్రం వ్రతం పాటిస్తున్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పైగా తన కుటుంబ సభ్యులంతా గతంలో వైఎస్ తోను, కాంగ్రెస్ తోను అనుబంధం ఉన్నవారేనని.. అందుకే ఇప్పుడు వైసీపీ వైపు వెళ్లారని సింపుల్ గా తేల్చేస్తున్నారు.

గంగరాజు సోదరుడు రంగరాజు ఇతరులు మాత్రం తాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ముగ్దులైపోయామంటూనే అసలు విషయం చెప్పేస్తున్నారు. నర్సాపురం నియోజకవర్గంలో తమ మద్దతు కోరారని.. తాము వైసీపీకి అండగా నిలబడతామంటూ.. రఘురామకృష్ణంరాజుకు పోటీగానే రంగంలోకి దిగామని చెప్పకనే చెప్పేస్తున్నారు.

మరోవైపు ఈ పరిణామాలతో ఇప్పటివరకు దాగుడుమూతలాడిన రఘురామకృష్ణంరాజు ఓపెన్ అయిపోయేటట్టే ఉన్నారు. ఈ నెల 11న ఢిల్లీలో పెద్ద పార్టీ అరేంజ్ చేసిన ఆయన.. దానికి ప్రధాని, హోంమంత్రి కూడా వస్తారని చెబుతున్నారు. భారీగా అతిథులు వస్తారని అంటూ జరుగుతున్న ఈ ప్రచారంలో.. మరికొంతమంది వైసీపీ ఎంపీలు కూడా గోడ దూకే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే 11వ తేదీ.. మరికొన్ని షాకులు జగన్ కు తప్పవేమోననే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఇప్పటివరకు కోల్డ్ వార్ లా బిజెపి, వైసీపీల మధ్య నడుస్తున్న వ్యవహారం.. ఇక డైరెక్ట్ వార్ గా మారిపోయే అవకాశం కనపడుతోంది. అదే జరిగితే.. కేసులున్న జగన్ ను బిజెపి అంత తేలికగా వదిలిపెడుతుందా అనేదే ప్రశ్న.

ఏమైనా ఇప్పటివరకు కావాలని బిజెపి జగన్ కు దూరమైందని ప్రచారం చేస్తున్న కొంతమందికి.. గోకరాజు ఫ్యామిలీ ఎంట్రీ.. జరగబోతున్న రఘురామకృష్ణంరాజు ఎగ్జిట్ కనువిప్పు కలిగిస్తాయనే చెప్పాలి.

Leave a Reply

*